అరుణాచల అక్షరమణమాల

భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ సుబ్రమణ్యస్యామి అవతారము. కలియుగ మానవులకు సనాతన మహర్షుల జ్ఞాన మార్గమును వ్యక్తము చేయడానికి మహాదేవుడైన, భోళాశంకరుడి తనయుడైన కుమారస్వామి మానవ రూపాన్ని ధరించిన దివ్య తేజోమయ సుందర మూర్తియే భగవాన్ శ్రీ రమణ మహర్షి. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి మార్గము జ్ఞాన మార్గము. “నీవెవరో విచారించు” అన్నదే మహర్షి వారి సందేశం. 16 సంవత్సరాల వయస్సులో అరుణాచలేశ్వరుని దివ్య సన్నిధిలో శివసాక్షత్కారము పొందిన మహనీయుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు. శ్రీ మహర్షి వారు ప్రపంచ వ్యాప్తముగా ఎంతోమంది తనను ఆశ్రయించిన శిష్యులను సత్య జ్ఞాన మార్గములో నడిపించారు.

బ్రహ్మజ్ఞాన సాధకులకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై, శివసాక్షాత్కార మహా ప్రాప్తికై భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు అనుగ్రహించిన మహాప్రసాదం “అరుణాచల అక్షరమణ మాల”. ఎన్నో సంవత్సరాలుమౌనం వహించి నిర్వికల్ప సమాధిలో విజయాన్ని సాధించి, తన హృదయాంతరంగాన్ని, పరమశివుడిపై గల అనురాగాన్ని, దివ్య ప్రేమ విరహాన్ని భగవాన్ శ్రీ రమణమహర్షి వారు 108 ద్విపద పద్యాలలో విరచించిన అపురూప రచనయే “అరుణాచల అక్షరమణ మాల”.

భగవంతుడిపై పై తనకున్న అనురాగాన్ని, దివ్యప్రేమ ప్రదర్శనను చూపడమే నిజమైన భక్తుడి లక్షణం. భగవాన్ శ్రీ రమణ మహర్షి నిర్వికల్పసమాధిలో నిరంతరం అరుణాచల శివుడితో సాంగత్యాన్ని కలిగిఉన్న మహితాత్ముడు. ఏ విధముగా ఒక పూలదండను వరుడి మెడలో వధువు సమర్పిస్తుందో ఆ విధముగా రమణ మహర్షి వారు ఆ పరమశివుడిపై తనకు గల ప్రేమానురాగాలను, పరితాపాన్ని దివ్య ప్రేమ విరహాన్ని 108 ద్విపదపద్యాలలో రచించి సమర్పించిన ప్రేమమాల “అరుణాచల అక్షరమణమాల”.

దివ్యానుభూతి పొందిన సిద్ధగురువు యొక్క హృదయము మరియు వారి బోధలు మరొక సిద్ధగురువుకే అవగతమవుతాయి. వారు మాత్రమే ఆ సిద్ధగురు బోధలను యధాతధముగా లోకానికి అందించగలరు. అటువంటి మహితాత్ముడైన సిద్ధగురువే శ్రీ రమణానంద మహర్షి వారు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రమణ మహర్షి వారు రచించిన అరుణాచల అక్షరమణమాల పద్యాలలోని మహర్షి వారి ఆంతర్యాన్ని సులభముగా అర్ధమయ్యే విధముగా దేశ విదేశాలలో లక్షలాదిమంది భక్తులకు తన ప్రవచనాల ద్వారా అందించారు. రమణ మహర్షి వారికి అరుణాచలశివుడి పై గల ప్రేమానురాగాలు, దివ్యప్రేమ విరహము మరియు ఎన్నో రహస్యాలు ఈ ప్రవచనాలద్వారా తెలుస్తాయి.

గ్యాలెరీ